బ్రెయిన్‌లో ట్యూమర్ లేదా మెదడు కణితులు (brain tumor) మెదడులోని కణాలు అసాధారణంగా , అనియంత్రితంగా పెరగడం వల్ల వస్తాయి. ఈ కణాలు కణితులను ఏర్పరుస్తాయి. ఇవి సాధారణ మెదడు పనితీరుకు అంతరాయం కలిగించవచ్చు. అనేక రకాల బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నాయి. ఇవి బినైన్ ట్యూమర్ (క్యాన్సర్ కానివి ) లేదా ప్రాణాంతక (క్యాన్సర్) కావచ్చు.
బినైన్ ట్యూమర్ (benign tumor)
క్యాన్సర్‌గా మారని కణితులను నిరపాయమైన కణితి లేదా బినైన్ ట్యూమర్ అంటారు. ఇవి ఇతర భాగాలకు వ్యాపించవు.
బ్రెయిన్ క్యాన్సర్ (malignant tumor)
క్యాన్సర్ కణితులు అనేవి ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. ఇవి ప్రాణంతాకమైనవి.
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు
మెదడు కణితి యొక్క లక్షణాలు కణితి ఎక్కడ వచ్చిన ప్రదేశం మరియు దాని పరిమాణం, అలాగే వ్యక్తి యొక్క ఆరోగ్యంపై ఆధారపడి మారవచ్చు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను సకాలంలో గుర్తించడం ద్వారా సులభంగా చికిత్స చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు. చాలా సందర్భాలలో మెదడు కణితులు ప్రాణాంతకంగా మారుతాయి.
కొన్ని సాధారణ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు
1. తలనొప్పి (headache)
మెదడు కణితుల యొక్క సాధారణ లక్షణం తలనొప్పి, కానీ అన్ని తల నొప్పులు మెదడు కణితుల వల్ల సంభవించవు. వారాలు లేదా నెలలు పాటు దీర్ఘకాలంగా ఉండే తలనొప్పి మెదడు కణితికి సంకేతం కావచ్చు. కాలక్రమేణా అధ్వాన్నంగా మారే తలనొప్పి లేదా తరచుగా లేదా తీవ్రంగా మారుతున్న తలనొప్పి మెదడు కణితికి ప్రధాన సంకేతం. మీరు ఇంతకుముందు అనుభవించని లేదా పెయిన్ కిల్లర్స్ ద్వారా ఉపశమనం పొందని తలనొప్పులు, ఇతర తలనొప్పుల నుండి భిన్నంగా అనిపించే తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్‌కి సంకేతం. ఇది మైగ్రైన్ నొప్పిని పోలి ఉండదు
2. మూర్ఛలు లేదా ఫిట్స్ (seizures)
ఎటువంటి కారణం లేకుండా యుక్తవయస్సులో ప్రారంభమయ్యే ఫిట్స్ మెదడు కణితి యొక్క లక్షణం కావచ్చు. మెదడు కణితుల వల్ల వచ్చే ఫిట్స్ ఒక వ్యక్తికి మెదడు కణితి యొక్క మొదటి లక్షణం కావచ్చు లేదా అవి వ్యాధి యొక్క తరువాత దశలో సంభవించవచ్చు.
3. వికారం మరియు వాంతులు (nausea and vomitings)
మరేమి కారణాలు లేని వికారం మరియు వాంతులు మెదడు కణితి యొక్క లక్షణం కావచ్చు. వికారం మరియు వాంతులు రోజులు లేదా వారాల పాటు కొనసాగడం లేదా కాలక్రమేణా అధ్వాన్నంగా మారడం లేదా మరింత తరచుగా లేదా తీవ్రంగా మారడం మెదడు కణితికి సంకేతం.
4. దృష్టి సమస్యలు (vision problems)
దృష్టిలో మార్పులు , అస్పష్టమైన దృష్టి వంటివి మెదడు కణితికి సంకేతం కావచ్చు. వస్తువులను స్పష్టంగా చూడటంలో ఇబ్బంది లేదా దృష్టిలో తీక్షణత కోల్పోవడం, డబుల్ దృష్టి లేదా ఒకే వస్తువు రెండు వస్తువులుగా కనిపించడం, కళ్లను కదిలించడంలో ఇబ్బంది , వస్తువులను ట్రాక్ చేయడం కష్టతరం కావడం వీటికి కొన్ని ఉదాహరణలు.
5. వినికిడి సమస్యలు (hearing problems)
ఒకటి లేదా రెండు చెవులలో పాక్షికంగా లేదా పూర్తిగా వినికిడి కోల్పోవడం, చెవులలో రింగింగ్, లేదా హిస్సింగ్ శబ్దాలు మెదడు కణితి యొక్క కొన్ని సంకేతాలు.
6. తల తిరగడం (dizziness or vertigo)
వికారం, వాంతులు లేదా బ్యాలెన్స్ సమస్యలతో కూడిన తల తిరగడం లేదా స్పిన్నింగ్ వంటి భావన మెదడు కణితికి సంకేతం కావచ్చు.
7. జ్ఞాపకశక్తి, ఆలోచన లేదా ఏకాగ్రతలో మార్పులు
మెదడు కణితిని సూచిస్తాయి. కొత్త సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో కష్టం, లేదా గతంలో నేర్చుకున్న సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో ఇబ్బంది , పనులపై దృష్టి పెట్టడం కష్టం అవ్వడం
మాట్లాడటం, భాషను అర్థం చేసుకోవడం లేదా చదవడం మరియు వ్రాయడం వంటివి కూడా కొన్నిసార్లు కష్టముగా అనిపించవచ్చు .
8. బలహీనత లేదా పక్షవాతం (paralysis)
కాలు, చేయి పనిచేయకుండా పోవడం, నోరు వంకరగా అవ్వడం జరగవొచ్చు. నడవలేకపోవడం కావొచ్చు .
రాయడం, చొక్కా బటన్‌లు వెయ్యడం లేదా పాత్రను పట్టుకోవడం వంటి నైపుణ్యం మరియు సమన్వయం అవసరమయ్యే పనులు కష్టంగా మారవచ్చు.
9. తిమ్మిరి / మొద్దుబారడం (numbness)
ముఖం, చేయి లేదా కాలు వంటి శరీరంలోని ఒక భాగంలో తిమ్మిరి మెదడు కణితికి సంకేతం కావచ్చు. ప్రభావిత ప్రాంతంలో జలదరింపు కూడా సంభవించవచ్చు. ప్రభావిత ప్రాంతంలో పాక్షికంగా లేదా పూర్తిగా మొద్దుబారడం అనేది మెదడు కణితిని సూచిస్తుంది
1o. ప్రవర్తనలో మార్పులు
ప్రవర్తనలో మార్పులు, డిప్రెషన్ లేదా చిరాకు వంటివి మెదడు కణితికి సంకేతం కావచ్చు.
వివిధ పరిస్థితులు ఈ లక్షణాలకు కారణమవుతాయని గమనించడం ముఖ్యం. వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ లక్షణాలు ఉంటే ఒక వ్యక్తికి మెదడు కణితి ఉందని అర్థం కాదు. అయినప్పటికీ, మీరు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే, కారణాన్ని గుర్తించడానికి మరియు తగిన చికిత్సను పొందడానికి డాక్టర్ని సంప్రదించడం చాలా అవసరం.