నేటి కాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఇండియన్ డయాబెటిస్ ఫెడరేషన్ (IDF) ప్రకారం, భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య దాదాపు 70 మిలియన్లు. డయాబెటిస్ లో ఒక్కోసారి చక్కెర ఎక్కువగానూ, కొన్నిసార్లు తక్కువగానూ ఉంటుంది. ప్రజలు తరచుగా తక్కువ రక్త చక్కెర స్థాయిని తేలికగా తీసుకుంటారు. కానీ ఇది కూడా ప్రమాదకారమే.
హైపోగ్లైసీమియా అనేది రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే తక్కువగా పడిపోయే పరిస్థితి. రక్తంలో చక్కెర స్థాయిలు 70 mg/dL కంటే తక్కువగా ఉండటం హైపోగ్లైసీమియాగా (hypoglycemia) పరిగణించబడుతుంది. డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయి తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
కొన్ని కారణాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గడానికి దోహదం చేస్తాయి. దీనికి గల కారణాలు ఇప్పుడు చూద్దాం
అధిక డోస్ లో మందులు :ఇన్సులిన్ మరియు కొన్ని మధుమేహం టాబ్లెట్స్ అధిక మోతాదులో తీసుకోవడం అత్యంత సాధారణ కారణం. డాక్టర్ ని కలిసి డోస్ సర్దుబాటు చేయించుకోవాలి.
భోజనం ఆలస్యంగ చెయ్యడం లేదా భోజనం తక్కువగా తినడం: మీరు తగినంతగా భోజనం తిననప్పుడు లేదా పస్తులున్నప్పుడు యదావిధిగా షుగర్ టాబ్లెట్ వేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలలో తగ్గుదలకు దారితీస్తుంది.
అధిక శారీరక శ్రమ: తీసుకున్న ఆహారం కన్నా లేదా మందులను సర్దుబాటు చేయకుండా తీవ్రమైన లేదా సుదీర్ఘమైన వ్యాయామంలో పాల్గొనడం వల్ల కూడా హైపోగ్లైసీమియా ఏర్పడవచ్చు.
మద్యం అధిక వినియోగం:తగినంత ఆహారం తీసుకోకుండా లేదా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మద్యం సేవించడం వల్ల హైపోగ్లైసీమియాకు దారితీయవచ్చు, ఎందుకంటే ఆల్కహాల్ లివర్ లో నిల్వ చేయబడిన గ్లూకోజ్‌ని విడుదల చేసే సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది.
మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధి: మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధి వంటి కొన్ని వైద్య పరిస్థితులు గ్లూకోజ్ జీవక్రియను దెబ్బతీస్తాయి మరియు హైపోగ్లైసీమియా ప్రమాదాన్ని పెంచుతాయి.
ఇన్సులిన్ నిర్వహణలో లోపాలు: ప్రమాదవశాత్తూ ఎక్కువ ఇన్సులిన్ తీసుకోవడం లేదా తప్పు రకం ఇన్సులిన్ ఇవ్వడం లేదా తప్పు మోతాదులో ఇన్సులిన్ ఉపయోగించడం వల్ల కూడా హైపోగ్లైసీమియా ఏర్పడవచ్చు.
మీకు రక్తంలో చక్కెర తక్కువగా ఉంటే, మీరు చేతులు, కాళ్లలో వణుకు, విపరీతమైన చెమటలు , కళ్లు తిరిగి పడిపోవడం , మగతగా లేదా బలహీనంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు.