Medicines for High Triglycerides in Telugu
రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ (Triglycerides) ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉండే కండిషన్‌ను ‘హైపర్ ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. ఇవి పెరగడం వల్ల పాంక్రియాటైటిస్ వస్తుంది. గుండె జబ్బులు కూడా వస్తాయి. మెదడుకూ హాని కలగజేసే అవకాశం ఉంది. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా, అంటే ఆహార నియమాలు, వ్యాయామం చేయడం వంటివి పాటించడం ద్వారా రక్తంలో వాటి పాళ్లను తగ్గించుకోవచ్చు.
ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిని తగ్గించడానికి జీవనశైలి మార్పులు సరిపోని సందర్భాల్లో, వైద్యులు మందులు సూచిస్తారు.
స్టాటిన్స్
అటోర్వాస్టాటిన్, సిమ్వాస్టాటిన్ మరియు రోసువాస్టాటిన్ వంటి మందులు ప్రధానంగా ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సూచించబడతాయి. అయితే అవి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. స్టాటిన్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తక్కువగా ఉంచడమే కాకుండా, గుండెపోటు లేదా స్ట్రోక్ అవకాశాలను కూడా గణనీయంగా తగ్గిస్తుంది.
మొత్తంమీద, స్టాటిన్స్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను 10% నుండి 20% వరకు తగ్గిస్తాయి. ఫైబ్రాట్స్ తో కలిపి వాడితే ట్రైగ్లిజరైడ్ మరింత అధికంగా తగ్గుతాయి. సుమారు 60 % వరకు తగ్గవచ్చు.
అనేక స్టాటిన్ మందులు అందుబాటులో ఉన్నాయి, వాటి లో కొన్ని అటోర్వాస్టాటిన్, రోసువాస్టాటిన్, పిటావాస్టాటిన్.
కొందరికి స్టాటిన్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కానీ అవి కొంతమంది వ్యక్తులలో దుష్ప్రభావాలను కలిగిస్తాయి. తలనొప్పి, వికారం వంటి జీర్ణ సమస్యలు తీసుకొస్తాయని అంటున్నారు. స్టాటిన్స్ తీసుకునే వ్యక్తులలో అలసట, బలహీనత ఏర్పడుతుంది.
5 నుంచి 10 శాతం కేసులలో శరీరం నొప్పులు, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులకి కారణం అవుతుంది. మీరు స్టాటిన్ తీసుకున్నప్పుడు మీ బ్లడ్ షుగర్ స్థాయి కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఇది అరుదుగా డయాబెటిస్‌కు దారితీస్తుంది. అరుదుగా స్టాటిన్స్ అధికంగా ఉపయోగించడం వల్ల కాలేయ సమస్యలకు దారితీయవచ్చు. అయినప్పటికీ, తీవ్రమైన దుష్ప్రభావాలు చాలా అరుదు అని గమనించడం ముఖ్యం.
కాలేయ వ్యాధి, కండరాల సమస్యలు ఉన్న వ్యక్తులు స్టాటిన్స్‌కు దూరంగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు, తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం ఉన్నవారు కూడా ఉపయోగించకూడదు.
ఫైబ్రేట్లు
ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి ఫెనోఫైబ్రేట్ మరియు జెమ్‌ఫైబ్రోజిల్ వంటి మందులు సాధారణంగా వాడుతారు. ఇవి ట్రైగ్లిజరైడ్ రక్త స్థాయిలను ఏకంగా 30% నుండి 50% వరకు తగ్గించడం వాళ్ళ ఎక్కువ మంది ఈ మందులనే ఉపయోగిస్తారు . ఇవి హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా పెంచుతాయి. ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను కేవలం కొంతవరకు తగ్గిస్తాయి.
ఫైబ్రేట్లుకి సాధారణంగా దుష్ప్రభావాలు చాలా తక్కువ. కండరాల నొప్పి , గాల్ బ్లాడర్ లో స్టోన్స్ మరియు అజీర్తి, కడుపు నొప్పి లాంటి సమస్యలు రావచ్చు .
మీకు తీవ్రమైన మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధి, పిత్తాశయ రాళ్లు, కండరాల రుగ్మతలు ఉన్నట్లయితే ఫైబ్రేట్లు ఉపయోగించకూడదు.
ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్
ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ చేప నూనెల నుండి తాయారుచేస్తారు. ఇవి ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించడంలో సహాయపడతాయి. సరైన మోతాదులో తీసుకుంటే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ ప్లాస్మా ట్రైగ్లిజరైడ్ స్థాయిలను దాదాపు 20% నుండి 50 % వరకు తగ్గిస్తాయి . ప్లాస్మా ట్రైగ్లిజరైడ్ స్థాయిలను సమర్థవంతంగా తగ్గించడానికి రోజుకు శరీరానికి 2-4 గ్రాముల అందించడానికి సరిపడే సంఖ్యలో క్యాప్సూల్స్ తీసుకోవాలి. 1 గ్రామ్ డోస్ రోజూ నాలుగు క్యాప్సూల్స్ ఉదయం రెండు మరియు సాయంత్రం రెండు వేసుకోవాల్సి ఉంటుంది
ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ మొత్తం కంటెంట్ బ్రాండ్ బ్రాండ్ కి చాలా తేడా ఉంటుంది. 1 గ్రాము క్యాప్సూల్‌కి 100mg కంటే తక్కువ ఒమేగా-3 ఫాటీ ఆసిడ్స్ ఉన్న బ్రాండ్లు కూడా ఉన్నాయి కాబట్టి, లేబుల్‌లను జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి. రోగి రోజుకు 2-4 గ్రాముల పొందేందుకు ఎక్కువ సంఖ్యలో క్యాప్సూల్స్ తీసుకోవలసి ఉంటుంది.
ఫిష్ ఆయిల్ థెరపీ ద్వారా అతిసారం, వికారం, అజీర్తి, పొత్తికడుపులో అసౌకర్యం వంటి జీర్ణశయ దుష్ప్రభావాలు కలగవచ్చు .
నియాసిన్
నియాసిన్ ని విటమిన్ బి త్రీ లేదా నికోటినిక్ యాసిడ్ అని కూడా పిలుస్తారు. నియాసిన్ ట్రైగ్లిజరైడ్‌లను 25% వరకు తగ్గిస్తుంది . హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలను 30% వరకు పెంచుతుంది. లిపోప్రొటీన్ ఏ ని కూడా తగ్గిస్తుంది. అయినప్పటికీ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి దీనిని అరుదుగా ఉపయోగిస్తారు.
చర్మం ఎర్రబడటం (ఫ్లషింగ్ ), దురద మరియు దద్దుర్లు వంటివి కొంతమందికి రావచ్చు. వికారం, అతిసారం మరియు కడుపు నొప్పి వంటి లక్షణాలకు కూడా దారితీయవచ్చు. యూరిక్ ఆసిడ్ ఎక్కువగా ఉన్నవారికి ఇది వాడిన తరువాత గౌట్ అటాక్స్ రావచ్చు.
కొంతమందిలో కాలేయంకి కూడా హాని కలిగిస్తుంది
దీర్ఘకాలంగా వాడితే కొందరికి మధుమేహం కూడా రావొచ్చు .
నియాసిన్, ప్రత్యేకించి చికిత్స యొక్క ప్రారంభ దశలలో, మైకము లేదా తలనొప్పికి దారితీయవచ్చు.
అధిక మోతాదులో నియాసిన్ కాలేయ సమస్యలకు దారితీయవచ్చు. ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్‌లతో సహా.
అరుదైన సందర్భాల్లో, నియాసిన్ ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. అంటే జ్వరం, చలి మరియు అలసట సంభవించవచ్చు.
ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వలన వీటిని డాక్టర్లు ఎక్కువగా రాయరు.
కాలేయ వ్యాధి, పెప్టిక్ అల్సర్ వ్యాధి మరియు, గౌట్ ఉన్న వ్యక్తులు దీని వాడకాన్ని నివారించాలి.గర్భధారణ సమయంలో, పాలిచ్చే తల్లులు వాడకూడదు.
ఎజెటిమైబ్ (Ezetimibe)
ఈ ఔషధం పేగులలో కొలెస్ట్రాల్ యొక్క శోషణను తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది ట్రైగ్లిజరైడ్ స్థాయిలను 8% మాత్రమే తగ్గించగలదు. అందుకే తక్కువగా వాడుతారు.
పీ సీ ఎస్ కె 9 ఇన్హిబిటర్లు (PCSK9 Inhibitors)
ఎవోలోకుమాబ్ మరియు అలిరోకుమాబ్ వంటి ఈ కొత్త మందులు సాధారణంగా అధిక ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న వ్యక్తులకు సూచించబడతాయి. అయితే అవి ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గించగలవు . ఇది ఇంజక్షన్ రూపంలో దొరుకుతుంది. ధర వేళల్లో ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువగా వాడారు.