Here, we will discuss hs-CRP Test (High-Sensitivity C-Reactive Protein ) meaning in Telugu
జిమ్ చేస్తూ, గుండెనొప్పి వస్తూ కుప్పకూలిన వారి గురించి తెలుసుకుంటూనే ఉన్నాం. ఇలా వచ్చే ఆకస్మిక గుండె మరణం వంటి కేసులకు ముందు హెచ్‌ఎస్ సిఆర్‌పి (hs-CRP) స్థాయిలు ఎక్కువగా ఉంటాయి అని కనుగొనబడింది. హెచ్‌ఎస్ సిఆర్‌పిని హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ (High-Sensitivity C-Reactive Protein ) అని అంటారు .
హెచ్‌ఎస్ సిఆర్‌పి ఇన్‌ఫ్లమేషన్ మార్కర్. ఇన్‌ఫ్లమేషన్ అనేది ఇన్ఫెక్షన్, ఒత్తిడి, ఆటో ఇమ్యూన్ వ్యాధులకు వ్యతిరేకంగా మన శరీరం ప్రతిచర్య. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే ఇన్‌ఫ్లమేషన్ కొద్దిసేపే ఉంటుంది. ఎక్కువ కాలం ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు శరీరానికి మంచిది కాదు. గుండెలో ఎక్కువ కాలం ఇన్‌ఫ్లమేషన్ గుండెపోటు, ఆకస్మిక మరణం, యాంజియోప్లాస్టి, బైపాస్ అవసరం మొదలైన సమస్యలతో ముడిపడి ఉంది.ఇలా దీర్ఘ కాలంగా ఉండే ఇన్‌ఫ్లమేషన్ స్థాయిని కనుక్కొనే పరీక్షే ఈ హెచ్‌ఎస్ సిఆర్‌పి రక్త పరీక్ష .
సి రియాక్టివ్ ప్రోటీన్ (C-Reactive Protein) అంటే ఏమిటి ?
స్టాండర్డ్ సిఆర్‌పి లేదా సి రియాక్టివ్ ప్రోటీన్ అనేది ఇన్‌ఫ్లమేటరీ మార్కర్. సిఆర్‌పి స్థాయిలు లీటరుకు మిల్లీగ్రాములలో కొలుస్తారు . నార్మల్ సిఆర్‌పి లెవెల్స్ అనేవి లీటరుకు 1 మిల్లీ గ్రాము కన్నా తక్కువగా ఉంటాయి. ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి అనేది ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి కొన్ని ఇన్ఫ్లమేటరీ మీడియేటర్లను విడుదల చేస్తుంది. ఆ మీడియేటర్లలో ఒకటి ఈ సిఆర్‌పి . సిఆర్‌పి కాలేయ నుంచి విడుదల అవుతోంది. తీవ్రమైన అనారోగ్య సందర్భాల్లో సిఆర్‌పి స్థాయిలు లీటరుకు 100 మిల్లీ గ్రాములు లేదా అంతకంటే ఎక్కువగా పెరగవచ్చు.
హెచ్‌ఎస్‌సిఆర్‌పి (High-Sensitivity C-Reactive Protein ) అంటే ఏమిటి ?
కార్డియో సి రియాక్టివ్ ప్రోటీన్ అని కూడా పిలుస్తారు. ఇది ఈ మధ్య వచ్చిన ఒక రకమైన సాధారణ రక్త పరీక్ష. ఇది కూడా సి రియాక్టివ్ ప్రోటీన్ పదార్థమే కానీ కొలిసే విధానమే మారుతుంది
స్టాండర్డ్ సిఆర్‌పి పరీక్ష కంటే హెచ్‌ఎస్‌సిఆర్‌పి ఎక్కువ సున్నితంగా ఉంటుంది. అంటే సి రియాక్టివ్ ప్రోటీన్‌లో చిన్న పెరుగుదలను కూడా ఇది కనుగొనగలదు. అంటే సాధారణంగా 1 నుండి 3 మిల్లీ గ్రాములు మధ్య పెరుగుదల హెచ్‌ఎస్‌సిఆర్‌పి పరీక్షతో మాత్రమే గుర్తించగలము. ఆరోగ్యంగా ఉన్నవారు ఫ్యూచర్‌లో ధమనుల్లో ఇబ్బందులు, గుండెపోటు, ఒక్కసారిగా గుండె ఆగిపోవడం,బ్రెయిన్ స్ట్రోక్ వంటి సమస్యలని ఎదుర్కొనే రిస్క్ ఎంత ఉంది అని ఎస్టిమేట్ చెయ్యడానికి ఈ పరీక్ష చేస్తారు .
హెచ్‌ఎస్‌సిఆర్‌పి పరీక్ష చేయించుకోవడానికి అనువైన సమయం?
హెచ్‌ఎస్‌సిఆర్‌పి పరీక్ష చేయించుకోవడం కోసం నిర్దిష్ట సమయం అంటూ లేదు. పరీక్ష రోజులో ఏ సమయంలోనైనా చేయవచ్చు మరియు ఉపవాసం అవసరం లేదు.
హెచ్‌ఎస్‌సిఆర్‌పి స్థాయిల యొక్క సాధారణ పరిధి
నార్మల్ లెవెల్స్ అంటే హెచ్‌ఎస్‌సిఆర్‌పి 1 మిల్లీ గ్రాము కంటే తక్కువగా ఉంటాయి.
ఇంటర్మీడియట్ స్థాయిలు అంటే హెచ్‌ఎస్‌సిఆర్‌పి 1 నుండి 3 మిల్లీ గ్రాములు ఉంటాయి
3 మిల్లీ గ్రాములు కంటే ఎక్కువ గా ఉన్నప్పుడు అధిక స్థాయిలో ఉందని అంటాము
హెచ్‌ఎస్‌సిఆర్‌పి ఎందుకు చేయించుకోవాలి?
ఆరోగ్యంగా ఉన్నవారు ఫ్యూచర్‌లో గుండెపోటు సమస్యలని ఎదుర్కొనే రిస్క్ ఎంత ఉంది అని ఎస్టిమేట్ చెయ్యడానికి ఈ పరీక్ష చేయించుకోవాలి.
ఇతర గుండె జబ్బుల ప్రమాద కారకాలు లేనప్పుడు అదిక స్థాయి హెచ్ఎస్‌సిఆర్‌పి గుండె పోతూ ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే , పెరిగిన హెచ్‌ఎస్‌సిఆర్‌పి సమక్షంలో ఇతర గుండె జబ్బుల ప్రమాద కారకాల వల్ల వచ్చే ప్రమాదం మరింత పెరుగుతుందని డాక్టర్ మల్లేశ్వర రావు గారు అంటున్నారు.
ఎవరు చేయించుకోవాలి ?
40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తులు సాధారణంగా రెగ్యులర్ హార్ట్ చెకప్ చేయించుకోవాలి. ఇందులో భాగంగా హెచ్‌ఎస్‌సిఆర్‌పి చేయించుకోవాలి.
హెచ్‌ఎస్‌సిఆర్‌పి అధిక స్థాయి ఉంటె ఏమిటి అర్ధం?
ఆరోగ్యంగా ఉన్న మనిషిలో హెచ్‌ఎస్‌సిఆర్‌పి స్థాయిలు ఎక్కువగా ఉంటే అది వ్యక్తికి గుండె ధమనులలో అడ్డంకులు, గుండెపోటు, ఆకస్మికంగా గుండె ఆగిపోవడం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్, ఇతర ధమనుల్లో ఇబ్బంది వంటి రుగ్మతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అర్థం.
హెచ్‌ఎస్‌సిఆర్‌పి అధిక స్థాయికి ఇతర కారణాలు ఏమిటి ?
గుండె జబ్బులు లేదా స్ట్రోక్ ప్రమాదం ఉన్న వ్యక్తుల్లో మాత్రమే కాకుండా ఇతర వ్యక్తుల్లో కూడా హెచ్‌ఎస్ సిఆర్‌పి పెరగవచ్చు .
- ఇన్ఫెక్షన్‌లు ఉన్నప్పుడు అంటే సాధారణ జలుబు నుండి టీబీ వరకు ఏదైనా ఇన్ఫెక్షన్. చిగుళ్ల వ్యాధి మరియు పిప్పి పన్ను ఉన్న కూడా పెరగవచ్చు
- రుమటాయిడ్ ఆర్థరైటిస్,సిస్టమిక్ లూపస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ మరియు సోరియాసిస్‌తో సహా వివిధ స్వయం ఆటో ఇమ్యూన్ వ్యాధులతో బాధపడే వారు
- శస్త్రచికిత్స తర్వాత హెచ్‌ఎస్ సిఆర్‌పి స్థాయిలు తాత్కాలికంగా పెరగవచ్చు.
- గాయం తర్వాత హెచ్‌ఎస్ సిఆర్‌పి స్థాయిలు తాత్కాలికంగా పెరగవచ్చు.
- గర్భిణీ స్త్రీలలో హెచ్‌ఎస్ సిఆర్‌పి లెవెల్స్ అనేవి సహజంగానే ఎక్కువ ఉంటాయి.
- డిప్రెషన్
- నిద్రలేమి
- ఊబకాయం
- మెటబాలిక్ సిండ్రోమ్
- మధుమేహం ఉన్న వ్యక్తులు
- ఆస్తమా , క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లాంటి ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నపుడు
- దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి
- కొన్ని రకాల క్యాన్సర్లు
- గౌట్
- అవయవ మార్పిడి చేసుకున్నవారిలో కూడా ఈ లెవెల్స్ ఎక్కువ అవుతాయి
ఇవన్నీ లేకుండా అధికంగా ఉంటే గుండె పోటు ప్రమాదం ఎక్కువ ఉందని అర్ధము
ఎక్కువగా ఉంటే గుండె జబ్బు ఉన్నట్టా ?
అధిక హెచ్‌ఎస్‌సిఆర్‌పి అనేది ఇన్‌ఫ్లమేషన్ మార్కర్ మాత్రమే. గుండెజబ్బులని ఉందో లేదో అని డైరెక్ట్ గా గుర్తించలేదు. ఎక్కువగా ఉంటే గుండె జబ్బు ఉన్నట్టు కాదు . వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అర్ధము .హెచ్‌ఎస్‌సిఆర్‌పి అనేది గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేసే పరీక్షలలో ఒక భాగం మాత్రమే. కుటుంబ చరిత్రలో గుండె జబ్బులు, హై కొలెస్ట్రాల్, చక్కెర జబ్బు ,అధిక రక్తపోటు, ధూమపానం,మెటబాలిక్ సిండ్రోమ్, ఊబకాయం వంటి ఇతర ప్రమాద కారకాలతో పాటు దీనిని పరిగణలలోకి తీసుకోవాలి.
ఎక్కువగా ఉంటే ఏమి చెయ్యాలి ?
ఏదైనా ఇటీవలి ఇన్ఫెక్షన్స్ వల్ల సీఆర్‌పి అండ్ హెచ్‌ఎస్‌సీఆర్‌పి అనేక వారాలపాటు ఎక్కువగా ఉండవచ్చని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. అలాగే , మీకు సీఆర్‌పీ పెరగడానికి కారణమయ్యే కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఉన్నట్లైతే సీఆర్‌పి అండ్ హెచ్‌ఎస్‌సీఆర్‌పి సంవత్సర తరబడి ఎక్కువగా ఉండొచ్చు.
హెచ్‌ఎస్‌సీఆర్‌పి ఎక్కువగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి తక్కువస్థాయి ఇన్‌ఫ్లమేషన్ ఉందని నిర్ధారించడానికి రెండు వారాల వ్యవధిలో రెండు సార్లు పరీక్ష చేయాలి. ఒకవేళ , హెచ్‌ఎస్‌సీఆర్‌పి 10 మిల్లీ గ్రాములు కంటే ఎక్కువ స్థాయిలో వస్తే, ఇది ఇన్‌ఫెక్షన్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉందని సూచిస్తుంది. ఈ సందర్భంలో, దీనికి గుండె జబ్బుకు, ఎటువంటి సంబంధం ఉండదు . దీనిని పరిగణలోకి తీసుకోము. రెండు వారాల తర్వాత మరొకసారి పరీక్షను చేయించాలి.