ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా, ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య తలనొప్పి. భరించలేని తలనొప్పికి ఒక ప్రధాన కారణం మైగ్రేన్. చాలా మంది మహిళలలో మైగ్రేన్ సమస్య అధికంగానే ఉంటుంది. మైగ్రేన్ నొప్పి ఎలా ఉంటుందో చూద్దాం.
మైగ్రెయిన్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?
మైగ్రేన్ యొక్క ప్రధాన లక్షణం తలనొప్పి. మైగ్రేన్ తలనొప్పికి కారణం మెదడు రక్తనాళాలు మరియు నరాల ఫైబర్స్ నుండి కొన్ని రసాయనాలు విడుదల కావడం. చీజ్, నట్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్రకాశవంతమైన కాంతి, నిద్ర భంగం, పీరియడ్స్, మెనోపాజ్, ప్రయాణం, వాతావరణ మార్పులు మరియు ఒత్తిడి వంటివి మైగ్రేన్ నొప్పిని ప్రేరేపిస్తాయి.
తలనొప్పికి ఒకటి, రెండు రోజుల ముందే మైగ్రేన్ లక్షణాలు ప్రారంభమవుతాయి. దీనిని ‘ప్రోడ్రోమ్’ దశ అని పిలుస్తారు.
మైగ్రేన్‌లో తల వెనుక లేదా తల సగం నొప్పి ఉంటుంది. ఇది తల యొక్క కుడి లేదా ఎడమ వైపున నొప్పిని కలిగించవచ్చు.
కానీ కొన్నిసార్లు ఇది తలమొత్తం భాగంలో కూడా సంభవించవచ్చు. మైగ్రేన్ విషయంలో, తలలో నొప్పి తీవ్రమైన స్థాయిలో ఉంటుంది.
ఈ సమయంలో ఎవరో మిమ్మల్ని సుత్తితో కొట్టినట్లు అనిపిస్తుంది.
మైగ్రేన్ నొప్పి 4 గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది.
అలాగే కళ్లలో ఏవో మెరుపులు వచ్చినట్లు ఉంటుంది. కళ్లల్లో కొన్ని రకాల రంగులు లేదా, జిగ్ జాగ్ లైన్లు ఏర్పడతాయి.
మైగ్రేన్‌తో బాధపడుతున్న వ్యక్తులు చిరాకు పడతారు. చిన్న శబ్దం వచ్చినా తల బద్దలయ్యేంతలా అనిపిస్తుంది. వెలుతురు ఎక్కువగా వచ్చే చోట కూర్చోవడం వల్ల కూడా వీరు అసౌకర్యానికి గురవుతారు.
మైగ్రేన్ సమస్యతో బాధపడేవారికి తలనొప్పి మాత్రమే కాదు, గందరగోళాన్ని కూడా అనుభవిస్తారు. మెదడులో మబ్బులు కమ్మిన ఫీలింగ్ కలుగుతుంది. ఏకాగ్రత, ఆలోచన శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది.
మైగ్రేన్ వచ్చినప్పుడు మైకము, కళ్ళు గుంజడం, చెవి, దవడల్లో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
మైగ్రేన్‌లో వికారం సమస్య ఉంటుంది, దీని కారణంగా వాంతులు కూడా సంభవించవచ్చు.