థైరాయిడ్ అనేది మెడలో ఉండే చిన్న సీతాకోకచిలుక ఆకారపు గ్రంథి. జీవక్రియ యొక్క పనితీరును నియంత్రించే హార్మోన్ను ఉత్పత్తి చేయడం దీని పని. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి అధికంగా థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే వ్యాధి.
ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లో దాదాపు 10 రెట్లు ఎక్కువ కనిపిస్తుంది. ఇది సాధారణంగా 20 మరియు 40 సంవత్సరాల మధ్య వయసు వారికి ఎక్కువగా వస్తుంది.
ఈ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు, శరీరం అధికంగా శక్తిని ఉపయోగించడం ప్రారంభిస్తుంది. హైపర్ థైరాయిడిజం శరీరం యొక్క అనేక విధులు వేగవంతం కావడానికి కారణమవుతుంది. దీని వల్ల, జీవక్రియ పెరుగుతుంది.
హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు:
హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు వ్యాధి యొక్క తీవ్రత, వ్యక్తి యొక్క శారీరక ఆరోగ్యం మరియు దాని వల్ల ఏ అవయవాలు ప్రభావితమవుతాయి అనేదానిని బట్టి మారవచ్చు.
- భయము, ఆందోళన మరియు చిరాకు
- మానసిక కల్లోలం
- ఏకాగ్రత తగ్గుతుంది
- నిద్రలేమి
- చేతి వణుకు
- వేడి పడక పోవడం
- అధిక శరీర ఉష్ణోగ్రత, జ్వరం వచ్చినట్టు అనిపించడం, వొళ్ళు వేడిగా ఉండడం
- విపరీతమైన చెమట
- సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోవడం
- నిరంతర అలసట మరియు బలహీనత
- ఆకలి ఎక్కువ అవ్వడం
- బరువు తగ్గిపోవడం
- పొడి చర్మం, దురద చర్మం, రంగు పాలిపోవడం, దద్దుర్లు, మొటిమలు కూడా కొన్ని లక్షణాలు
- జుట్టు సన్నబడటం మరియు రాలడం
- కండరాలలో బలహీనత మరియు నొప్పి.
- ఎముకలో కాల్షియం వేగంగా కోల్పోవడం జరుగుతుంది .
- స్త్రీలలో రుతుక్రమం సక్రమంగా జరగకపోవడం, సంతానం లేమి
- కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు.
- గుండె దడ: హార్ట్ చాలా వేగంగా కొట్టుకోవడం. గుండె నిమిషానికి 100 సార్లు కన్నా ఎక్కువగా కొట్టుకుంటుంది. దీని వాళ్ళ గుండె దడ కలగవచ్చు.
- క్రమరహిత హృదయ స్పందన రేటు: దీన్ని ఆట్రియల్ ఫిబ్రిలేషన్ అని అంటారు. ఇందులో గుండె కొట్టుకునే తీరు ఒక లయలో ఉండదు. ఇది రక్తం గడ్డకట్టడం, బ్రెయిన్ స్ట్రోక్, గుండె వైఫల్యం మరియు ఇతర గుండె సమస్యలకు దారితీస్తుంది.
- గాయిటర్: థైరాయిడ్ గ్రంథి పెద్దగా అవ్వడాన్ని గాయిటర్ అంటారు. ఇది మెడ ఉబ్బినట్టుగా కనబడటానికి కారణం కావచ్చు.అప్పుడు శ్వాస మరియు మింగడంలో కష్టంగా అనిపించవచ్చు.
- కళ్ళు ఉబ్బడం: కళ్ళు ముందుకు వచ్చినట్టు అనిపించడం, కళ్లు పొడిబారడం, ఎగువ లేదా దిగువ కనురెప్పలలో వాపు. దీనిని వైద్యపరంగా ఎక్సోఫ్తాల్మోస్ అంటారు.కంటిలో లేదా వెనుక నొప్పి, పైకి, క్రిందికి లేదా పక్కకి చూస్తున్నప్పుడు. కళ్లను కదిలించడంలో ఇబ్బంది అనిపించవచ్చు.
పరీక్షలు:
మీరు ఈ లక్షణాలను కలిగిఉంటే , వైద్యుడిని సంప్రదించండి. మీకు థైరాయిడ్ సమస్య ఉందని డాక్టర్ భావిస్తే, మీ థైరాయిడ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి థైరాయిడ్ రక్త పరీక్షలను ఆదేశించవచ్చు. రక్త పరీక్షలో మీకు థైరాయిడ్ అధికంగా ఉందని తేలితే, కారణాన్ని గుర్తించడానికి మీకు మరిన్ని పరీక్షలు చేయిస్తారు.
హైపర్ థైరాయిడిజం చికిత్స:
దీనికి మూడు రకాల ట్రెయిట్మెంట్స్ ఉన్నాయి
- అదనపు థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధించే డ్రగ్స్
- రేడియోయోడిన్ చికిత్స
- థైరాయిడ్‌లో కొంత భాగం లేదా మొత్తం సర్జరీ ద్వారా తొలగించడం
Pingback: Hypothyroidism symptoms in Telugu - DM HEART CARE CLINIC