మన శరీరంలో మూత్రపిండాలు (KIDNEYS) అతి ముఖ్యమైన అవయవాలు. మనం తినే ఆహారంలో వ్యర్ధాలను ఫిల్టర్ చేసే ప్రధానమైన పని మూత్రపిండాలది.
ప్రస్తుతం కాలంలో కిడ్నీలో రాళ్ల (KIDNEY STONES) సమస్య చాలా ఎక్కువైంది. ఆహారంలో ఎక్కువగా ఉప్పు తీసుకోవడం లేదా నీరు తక్కువగా తాగడం కారణంగా కిడ్నీ స్టోన్స్ ఏర్పడొచ్చు. కిడ్నీ రాళ్లు పెట్టే బాధ అంతా ఇంతా కాదు. మూత్రపిండాల్లో రాళ్ల లక్షణాలను తెలుసుకుందాము , తద్వారా మీరు వాటిని ముందుగానే గుర్తించి వైద్య సహాయం పొందవచ్చు.
కిడ్నీ స్టోన్ పరిమాణం మరియు లక్షణాలు
కిడ్నీలో స్టోన్స్ ఏర్పడిన మొదటలో చాలా చిన్న సైజులో ఉంటాయి. కిడ్నీలో రాళ్లు చిన్నగా ఉంటే, ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఇవి యూరిన్లో వెళ్లిపోతాయి. వాటి పరిమాణం పెరిగే కొద్దీ సమస్య కలుగుతుంది. అలాగే కిడ్నీలో రాళ్లు ఉన్నంతవరకు ఎలాంటి లక్షణాలను చూపించకపోవచ్చు . అవి మూత్ర నాళంలోకి వెళ్లడం మొదలయ్యాక లక్షణాలు ఒక్కొక్కటి బయటపడతాయి.
కిడ్నీ స్టోన్ లక్షణాలు
నొప్పి:
మూత్రపిండాల్లో రాళ్లకు సంబంధించిన అత్యంత సాధారణ లక్షణం నొప్పి. మూత్రపిండాలు నడుము భాగంలో వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. అందువల్ల స్టోన్స్ నొప్పి ఈ ప్రాంతంలో మొదలవుతుంది.
ముందు చెప్పుకున్నట్టు, మూత్రనాళంలో రాయి కదులుతున్నప్పుడు నొప్పి మొదలవుతుంది. చిన్న స్టోన్స్ తక్కువ లేదా నొప్పి లేకుండా శరీరం నుండి బయటకు సులువుగా వెళ్లిపోతాయి. మూత్ర నాళంలో పెద్ద రాళ్ళు చిక్కుకుపోవచ్చు. అప్పుడు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు లేదా నడుము నొప్పి ప్రారంభమవుతుంది.
ఈ విధంగా రాయి మూత్రనాళంలో అడ్డుపడి, కిడ్నీకి ఒత్తిడి పెంచుతుంది. ఈ నొప్పి పక్కటెముకల క్రింద వైపు మరియు వెనుక భాగంలో ఉండొచ్చు. కొన్ని సార్లు దిగువ కడుపు నుండి గజ్జలకు వ్యాపించే నొప్పి రావొచ్చు .కొన్ని సార్లు నొప్పి వాస్తు పోతూ ఉండవచ్చు.
నొప్పి తేలికపాటి నుండి తీవ్రమైన వరకు ఉంటుంది. నొప్పి తో పాటు వికారం మరియు వాంతులు కలిసి రావొచ్చు . ఈ నొప్పి ప్రశాంతంగా కూర్చోనీయదు, హాయిగా పడుకోనీయదు.
మూత్రవిసర్జన లక్షణాలు
మూత్రపిండ రాళ్లు తరచుగా మూత్రవిసర్జనను కలిగించవచ్చు . అంతే కాకుండా మూత్రవిసర్జన చేసేటప్పుడు నొప్పి లేదా మంట వంటి లక్షణాలను కూడా కలిగిస్తాయి. దీన్ని ‘డైసూరియా’ (DYSURIA) అంటారు.
మూత్రంలో రక్తం
కొన్నిసార్లు, మూత్రపిండాల్లో రాళ్లు మూత్రంలో రక్తం కనిపించడానికి కారణమవుతాయి. దీనిని హెమటూరియా (HEMATURIA) అని కూడా పిలుస్తారు. రాయి మూత్ర నాళానికి నష్టం కలిగించిందని ఇది సంకేతం. ఇలాంటప్పుడు పింక్, ఎరుపు లేదా గోధుమ రంగు లో మూత్రం వస్తుంది.
జ్వరం మరియు చలి
కొన్ని సందర్భాల్లో, మూత్రపిండాల్లో రాళ్లు జ్వరం మరియు చలికి కారణమవుతాయి. ఇది కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండవచ్చని సంకేతం. ఇలాంటప్పుడు మూత్రం మబ్బుగా, దుర్వాసనతో ఉంటుంది.
మూత్ర విసర్జన చేయడంలో ఇబ్బంది
కిడ్నీలో రాళ్ల వల్ల కొన్నిసార్లు మూత్ర విసర్జన కష్టమవుతుంది. మూత్ర నాళంలో రాయి అడ్డుపడుతుందనడానికి ఇది సంకేతం.
మీరు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే, వెంటనే వైద్యుడిని చూడటం చాలా ముఖ్యం. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడిన తర్వాత సరైన చికిత్స తీసుకోకపోతే మూత్రపిండాల పనితీరు మందగించి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని తెలుసుకోండి. మీ డాక్టర్ కిడ్నీలో రాళ్లను నిర్ధారించడానికి ఎక్స్ రే , సీటీ స్కాన్‌లు లేదా అల్ట్రాసౌండ్‌లు వంటి ఇమేజింగ్ పరీక్షలను ఉపయోగిస్తారు . రక్త పరీక్షలు కూడా అవసరమవ్వొచ్చు.
మీరు ఈ లక్షణాలలో దేనినైనా అనుభవిస్తే, వీలైనంత త్వరగా వైద్య సంరక్షణను పొందాలని నిర్ధారించుకోండి. కిడ్నీ స్టోన్ పరిమాణాన్ని, లక్షణాలను బట్టి చికిత్స ఉంటుంది అని తెలుసుకోండి.
మూత్రపిండాల్లో రాళ్లు చాలా చిన్నగా ఉంటే కొన్ని మందుల ద్వారా ఆ రాళ్ళను మూత్రం ద్వారా బయటికి వచ్చేట్టు చేస్తారు. రాళ్లు మూత్రం ద్వారా వచ్చేందుకు వీలు లేనంత పెద్ద సైజులో ఉంటే అటు వంటి వాళ్లకి సర్జరీ అవసరం పడుతుంది.
కిడ్నీ రాళ్లు రాకుండా మీకు రెండు అతి ముఖ్యమైన టిప్స్
- ఎక్కువ నీరు తాగాలి.
- ఆహారంలో ఉప్పుని తగ్గించాలి.