BNP మీ గుండె ద్వారా ఉత్పత్తి అయ్యే హార్మోన్. గుండె లోపల ఒత్తిడి పెరిగినప్పుడు, BNP మరియు NT-proBNP ప్రొటీన్లు ఉత్పత్తి అవుతాయి.
BNP ఎందుకు పెరుగుతుంది? ఎవరికి పెరుగుతుంది?
గుండె వైఫల్యంలో, గుండె లోపల ఒత్తిడి పెరుగుతుంది. గుండె వైఫల్యం ప్రారంభమైనప్పుడు లేదా ఇప్పటికే ఉన్న గుండె వైఫల్యం తీవ్రతరం అయినప్పుడు , BNP స్థాయిలు ప్రమాదకరమైన స్థాయికి పెరుగుతాయి.
గుండె వైఫల్యం స్థిరమైన స్థితికి చేరుకున్నప్పుడు, BNP స్థాయిలు తగ్గుతాయి.
గుండె వైఫల్యం మరియు ఇతర గుండె సమస్యలు NT-proBNP స్థాయిలతో ముడిపడి ఉంటాయి.గుండె వైఫల్యంతో బాధపడుతున్న వ్యక్తులు దాదాపు ఎల్లప్పుడూ అధిక BNP మరియు NT-proBNP కలిగి ఉంటారు.
పరీక్ష వల్ల ఉపయోగాలు
గుండె వైఫల్యంతో బాధపడుతున్న వ్యక్తులు వాపు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనేక రకాల లక్షణాలను కలిగి ఉండవచ్చు. కానీ ఈ సంకేతాలు గుండె వైఫల్యంతో పాటు ఇతర వ్యాధుల వల్ల కూడా సంభవించవచ్చు. ఉదాహరణకు అది ఊపిరితిత్తుల సమస్యలు, రక్త హీనత లేదా కిడ్నీ వైఫల్యం వల్ల కూడా కావొచ్చు
BNP మరియు NT-proBNP పరీక్షలు రోగి ఎదుర్కొంటున్న లక్షణాలు గుండె వైఫల్యం లేదా మరేదైనా కారణమా అని నిర్ధారించడంలో సహాయపడతాయి.
గుండె వైఫల్యం ఇప్పటికే నిర్ధారణ అయిన రోగులు కూడా BNP మరియు NT-proBNP పరీక్షలు చేయించుకోవాలి. ఈ సందర్భాలలో, వ్యాధి ఎంత తీవ్రంగా ఉందో మరియు భవిష్యత్తులో అది ఎలా అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
పరీక్ష ఎవరికీ అవసరం?
మీకు గుండె వైఫల్యం సంకేతాలు ఉంటే, బహుశా మీ కార్డియాలజిస్ట్ మీకు BNP లేదా NT-proBNP పరీక్షను సూచించవచ్చు. మీరు గుండె వైఫల్యంతో బాధపడుతున్నారని ఇప్పటికే నిర్ధారించబడితే, పరిస్థితి గురించి మరింత అర్థం చేసుకోవడానికి మీ డాక్టర్ మీకు BNP పరీక్షను నిర్వహిస్తారు.
గుండె వైఫల్యం యొక్క ప్రధాన సంకేతాలు ఏమిటంటే
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా తగినంత గాలిని పొందడంలో ఇబ్బంది.
- కాళ్లు, చీలమండలు లేదా కడుపు వాపు.
- అలసట.
గుండె వైఫల్యం కోసం చేసే పరీక్షలు
- ఈసీజీ టెస్ట్
- 2d ఎకోకార్డియోగ్రామ్
- BNP
పరీక్ష ఏ విధంగా చేస్తారు?
మీరు BNP లేదా NT-proBNP పరీక్ష కోసం కొంచెం రక్తం ఇవ్వాల్సి ఉంటుంది . సాధారణంగా మీ చేతిలోని సిర నుండి రక్తం తీసుకుంటారు.
BNP మరియు NT-proBNP లలో ఏది ప్రధానం ?
BNP మరియు NT-proBNP పరీక్ష ఫలితాలు విభిన్న విలువలను అందిస్తాయి.గుండె వైఫల్యంతో బాధపడుతున్న రోగులను పర్యవేక్షించడానికి NT-proBNP పరీక్షను ఎక్కువగా ఉపయోగిస్తారు.
పరీక్ష కోసం ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ?
ఈ పరీక్ష కోసం మీరు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు లేదా మరేమీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
NT-proBNP నార్మల్ స్థాయిలు ఏమిటి?
74 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకు NT-proBNP యొక్క సగటు స్థాయి 125 కంటే తక్కువగా ఉంటుంది. 75 మరియు 99 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులకు 450 కంటే తక్కువగా ఉంటుంది.
NT-proBNP ఏ స్థాయిలో ఉంటే గుండె వైఫల్యం చెందినట్టు ?
50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న రోగులు, 450 కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నప్పుడు గుండె వైఫల్యాన్ని కలిగిఉన్నారని అర్థం. 50 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రోగులు 900 కంటే ఎక్కువ స్థాయిలను కలిగి ఉంటే గుండె వైఫల్యం ఉన్నట్టు.
NT-proBNP స్థాయిలు పెరగడానికి ఇతర కారణాలు ఏమిటి?
గుండె వైఫల్యం కాకుండా ఇతర ఆరోగ్య పరిస్థితులు NT-proBNP స్థాయిలను పెంచడానికి కారణం కావచ్చు. దీనికి కొన్ని ఉదాహరణలు.
- కిడ్నీ వైఫల్యం.
- ఊపిరితిత్తుల రక్తపోటు (Pulmonary arterial hypertension or PAH).
- సెప్సిస్.
NT-proBNP స్థాయిలు ఏం అంశాలమీద ఆధారపడి ఉంటుంది ?
మీ BNP మరియు NT-proBNP స్థాయిలు మీ వయస్సు, ఆడ లేదా మగ, శరీర బరువు మరియు జన్యువుల వంటి అంశాల ద్వారా కూడా ప్రభావితమవుతుంది. దీని కారణంగా, పరీక్ష ఫలితం గురించి ఒక నిర్ధారణకు రావడానికి, మీ డాక్టర్ మీ ల్యాబ్ రిఫరెన్స్ పరిధి మరియు మీ వయస్సు రెండింటినీ పరిశీలిస్తారు.