LIVER DISEASE SYMPTOMS TELUGU
ఈ రోజుల్లో వేగంగా మారుతున్న జీవనశైలి కారణంగా ప్రజలు కాలేయ సమస్యలకు గురవుతున్నారు. కాలేయం దెబ్బతినడం వల్ల, ఒక వ్యక్తి చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, దానిని సకాలంలో గుర్తించినట్లయితే, దాని తీవ్రమైన పరిణామాలను నివారించవచ్చు. ఈ లక్షణాల ద్వారా మీరు కాలేయ సమస్యలను గుర్తించవచ్చు. కానీ ఈ లక్షణాలు కాలేయ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి మారవచ్చు.
జీర్ణ సమస్యలు
కాలేయంలో ఉత్పత్తి అయ్యే పైత్యరసం ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. కాబట్టి కాలేయం సాధారణంగా పని చేయనప్పుడు, జీర్ణ సమస్యలు ఉంటాయి. ఏం తిన్నా అరగకపోవడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
కడుపు నొప్పి
పొట్ట కుడి ఎగువ భాగంలో నొప్పి రావడం, అసౌకర్యంగా అనిపించడం జరిగితే అది కాలేయం సమస్యగా అర్థం చేసుకోవాలి.
వికారం మరియు వాంతులు
మీరు తరచుగా వాంతులు లేదా వికారంగా అనిపిస్తే, అవి కాలేయ వ్యాధి హెచ్చరిక సంకేతాలుగా గుర్తించాలి. పోర్టల్ సిరలో ఒత్తిడి పెరిగినప్పుడు, అది చీలిపోతుంది. రక్తం వాంతులు దారితీస్తుంది. వాంతిలో రక్తం వస్తే వెంటనే డాక్టర్‌ని కలవాలి.
పొత్తికడుపు వాపు
దీర్ఘకాలిక కాలేయ వ్యాధి కారణంగా, మీ కడుపులో నీరు పేరుకుపోతుంది. తద్వారా పొత్తికడుపు వాపు వస్తుంది . అసైటిస్ అని పిలువబడే పొత్తికడుపు వాపు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కూడా కలిగిస్తుంది.
పాదాలు పొంగిపోవడం
నీరు పేరుకుపోవడం వల్ల కాళ్లలో వాపు రావచ్చు. దీనిని పీడల్ ఎడెమా అంటారు
ఆకలి తగ్గి పోవడం
ఎప్పుడైతే లివర్ కు సంబంధించిన సమస్య వచ్చిందో అప్పుడు ఆకలి తగ్గి పోతుంది. ఎలాంటి ఆహారాన్ని తినాలి అని అనిపించదు. ఇది బరువు తగ్గడం, బలహీనత మరియు పోషకాహారలోపానికి కూడా దారి తీస్తుంది.
బరువు తగ్గిపోవడం
కాలేయం పాడైపోయినప్పుడు అది శరీరానికి పోషకాలను ప్రాసెస్ చేసే మరియు గ్రహించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది బరువు తగ్గడానికి దారితీస్తుంది.
అలసట
లివర్ సమస్యలు ఉన్నవారిలో అలసట ఉంటుంది. సరిగ్గా ఏ పని చేయలేరు . ఒక వేళ పని చేసినా త్వరగానే నీరసంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దురద
కాలేయం సాధారణ పనితీరు చెదిరినప్పుడు చర్మం కింద పైత్య లవణాలు అధిక స్థాయిలో పేరుకుపోతాయి. ఫలితంగా దురద వస్తుంది.
కళ్ళు పసుపు రంగులోకి మారడం
ఆరోగ్యకరమైన కాలేయం బిలిరుబిన్‌ను గ్రహిస్తుంది. దానిని పిత్తంగా మారుస్తుంది. అలా బిలిరుబిన్ మలం ద్వారా విసర్జించబడుతుంది. కామెర్లుతో, కాలేయం బిలిరుబిన్‌ను గ్రహించదు.
రక్తంలో బిలిరుబిన్ పేరుకుపోతుంది. చర్మం మరియు కళ్ళు పసుపు రంగులోకి మారుతాయి. దీనిని కామెర్లు రావడం లేదా జాండిస్ (JAUNDICE) రావడం అంటారు . మూత్రం కూడా ముదురు పసుపు రంగులో ఉంటుంది
నిద్ర సమస్యలు
కాలేయం శరీరం నుండి విషాన్ని తొలగించడానికి పని చేస్తుంది, కానీ అది దెబ్బతిన్నట్లయితే, ఈ టాక్సిన్స్ రక్తంలో పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. ఇది స్లీప్ సైకిల్కు భంగం కలిగిస్తుంది. పగటిపూట నిద్రపోవడం అంటే నిద్ర మత్తు ఉంటుంది. రాత్రి నిద్రలేమి ఉండొచ్చు
సెక్స్ సమస్యలు
సెక్స్ హార్మోన్ల ఉత్పత్తిని కూడా లివర్ క్రమపరుస్తుంటుంది. లివర్ అనారోగ్యం వల్ల ఆడవాళ్ళలో రుతుక్రమం దెబ్బతింటుంది. మగవాళ్ళలో శరీరం మీద వెంట్రుకలు రాలిపోవడం, ఇంపాటెన్సీ కలగవచ్చు. మగవారిలో రొమ్ము సైజు పెరగవచ్చు. దీనిని గైనెకోమాస్టియా అంటారు.
ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం
అవసరమైన నిర్దిష్ట ప్రోటీన్లు లేకపోవడం వల్ల రక్తం గడ్డకట్టదు.ఎందుకంటే ఈ ప్రోటీన్ కాలేయంలో తయారవుతుంది .కాలేయం సాధారణంగా పనిచేయకపోతే ప్రొటీన్ ఉత్పత్తి దెబ్బతింటుంది. మలంతో రక్తస్రావం కావచ్చు. ముక్కు నుండి రక్తం కారడం, చిగుళ్ళలో రక్తస్రావం కు కారణమవుతుంది.
మానసిక సమస్యలు
కాలేయం రక్తం నుండి విషాన్ని ఫిల్టర్ చేయలేనప్పుడు, ఏకాగ్రత లేకపోవడం, గందరగోళం, జ్ఞాపకశక్తి కోల్పోవడం , చికాకు , మానసిక ఆందోళన లాంటి మానసిక సమస్యలు రావొచ్చు.
కోమా
లాస్ట్ స్టేజెస్ లో సివియర్ లివర్ ఫెయిల్యూర్ వల్ల మెదడులో టాక్సిన్స్ పేరుకుపోతుంది . దీని వల్ల మగత, స్పష్టంగా మాట్లాడలేకపోవడం మరియు కోమాలోకి పేషెంట్ వెళ్ళవచ్చు . దీనిని హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటారు.
ఈ లక్షణాలు తరచూ కనిపిస్తున్నప్పుడు కచ్చితంగా ఓసారి కాలేయాన్ని పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. కొన్నిసార్లు కాలేయ సమస్యలు, ఎటువంటి లక్షణాలు లేకుండా వస్తాయి.