హార్ట్ ఫెయిల్యూర్ సమస్యలతో ఆస్పత్రుల్లో చేరేవారిసంఖ్య ఈమధ్య పెరిగిపోతోంది. హార్ట్ ఫెయిల్యూర్ చాలా ప్రమాదకరమైన జబ్బు. ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఈ హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు గురించి ముందస్తుగా తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.
హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు తెలుసుకునే ముందు అసలు హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటో తెలుసుకుందాం.
గుండె మన శరీరంలో ఒక ప్రధానమైన అవయవం. శరీరంలో అవయవాలన్నింటికీ నిరంతరం రక్తం సరఫరా చేయడం గుండె యొక్క పని. శరీరంలో అవయవాలన్నింటికీ సరిపడేంత రక్తం సరఫరా చెయ్యలేకపోతే దాన్ని హార్ట్‌ఫెయిల్యూర్ అంటారు. దీన్నే గుండె కండరాల వైఫల్యం అని కూడా అంటారు. ఫలితంగా గుండె ఎన్‌లార్జ్ అవుతుంది.
రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడటం, కవాటాలు దెబ్బతినడం, హార్ట్ బీటింగ్‌లో మార్పులు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల వల్ల హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు.
హార్ట్‌ఫెయిల్యూర్ వల్ల నీరు, ఇంకా ఇతర ద్రవాలు ఊపిరితిత్తుల్లో, కడుపులో, కాలేయంలో, మరియు కాలు భాగంలో పేరుకుంటాయి.
ఇప్పుడు మనం హార్ట్‌ఫెయిల్యూర్ వల్ల వచ్చే లక్షణాల గురించి తెలుసుకుందాం.
హార్ట్‌ఫెయిల్యూర్ వల్ల వచ్చే లక్షణాలు
1. కొద్దిపాటి శారీరక శ్రమ చేసినా శ్వాస అందకపోవడం.
కొన్ని అడుగులు నడిచిన తర్వాత ఊపిరి ఆడకపోవడం లేదా ఉక్కిరిబిక్కిరి అవ్వడం చాలా ఎక్కువగా కనిపించే లక్షణం. ఇది తొలిదశలో మెట్లు ఎక్కే సమయంలో లేదా బరువులు ఎత్తే సమయంలో మాత్రమే వస్తుంది. క్రమేపీ జబ్బు ముదిరిన కొద్దీ సాధారణ వ్యాయామ సమయంలో, లేదా లెవెల్ గ్రౌండ్‌లో నడుస్తున్నప్పుడు కూడా మీరు శ్వాస ఆడకపోవడాన్ని అనుభవించవచ్చు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే మూడవ దశలో పడుకొని ఉన్నా శ్వాస అందకపోవడం జరగవచ్చు.
2.దగ్గు.
ఊపిరితిత్తుల్లో నీరు చేరినప్పుడు దగ్గు వస్తుంది . మొదట్లో అప్పుడప్పుడు దగ్గు వచ్చిన, మలిదశలో దగ్గు ఎడతెగకుండా ఇబ్బంది పెట్టొచ్చు. దగ్గు అనేది పొడిదగ్గు కావచ్చు. లేదా దగ్గులో కొంచెం శ్లేష్మం కఫం కూడా కావచ్చు. సాధారణంగా దగ్గు పడుకున్న తర్వాత ఎక్కువవుతుంది.
3.పరోక్సీస్మాల్ నాక్టుర్నాల్ దిస్ప్నియా
కొంతమంది రోగులు హటాత్తుగా నిద్ర లో నుండి ఉలిక్కిపడి లేవడం లాంటివి చేస్తారు. ఇది ఎక్కువగా రోగి పడుకున్న 1-3 గంటల మధ్యలో సంభవిస్తుంది. దీనిని పరోక్సీస్మాల్ నాక్టుర్నాల్ దిస్ప్నియా అంటారు. ఇది హటాత్తుగా నిద్రలో నుండి ఉలిక్కిపడేలా చేస్తుంది. ఇందులో కూడా శ్వాసలో అవాంతరాలు, దగ్గు మరియు గురక. ఇవన్ని నిద్రపోయిన తరువాత ఒకటి మూడు గంటల మధ్యలో ఏర్పడతాయి.
4.కాళ్ళ వాపు.
ఎక్కువమందిలో నీరు చేరడం పాదాలు, చీలమండలు మరియు కాళ్ళలో ఆరంభమవుతుంది. చివరి దశలో అయితే ముఖం, చేతులు మరియు కడుపులో కూడా నీరు చేరవచ్చు.
5.పొట్ట ఉబ్బడం
పొట్టలో నీరు చేరడం వల్ల పొట్ట ఉబ్బడం, కడుపు నొప్పి, ఆకలి వేయకపోవడం జరుగుతుంది.
6.బరువు పెరగటం
శరీరంలో నీరు చేరటం వలన బరువు పెరుగుతారు. కానీ జబ్బు చివరిదశలో ఆకలి చచ్చిపోవడం వల్ల మనిషి బరువు కోల్పోయే అవకాశం ఉంది .
7.తరచుగా మూత్రానికి వెళ్లడం
హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు తరచుగా మూత్రానికి ఎక్కువగా వెళ్తుంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు మెడ పైన ఉండే నరాలు కూడా ఉబ్బుతాయి.
8.ఆకలి లేకపోవడం
హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు, జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతి కలుగుతుంది. దాంతో ఆకలి తగ్గుతుంది. అంతేకాకుండా ఉదరభాగంలో నొప్పి కూడా కలుగవచ్చు.
9.గుండె దడ
హార్ట్ ఫెయిల్యూర్లో హార్ట్ బీట్ పెరుగుతుంది. హార్ట్ బీట్ సాధారణ స్థాయి కన్నా వేగంగా ఉంటే, దానిని టాఖీకార్డియా అంటారు. టాఖీకార్డియా ఉంటే గుండెదడ రావచ్చు.
10.ఛాతి నొప్పి
కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ రోగులు రోగులకు ఛాతి నొప్పి తరచుగా రావడం జరుగుతుంది
11.అలసట
ఎక్కువ నీరసం, అలసటకు గురి కావడం హార్ట్ ఫెయిల్యూర్ ఒక లక్షణం.
మీకు గనక ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే గుండె డాక్టర్ ని సంప్రదించండి. ఈసీజీ, 2డి ఎకో, బిఎంపీ పరీక్షల ద్వారా ఒక మనిషికి గుండె వైఫల్యం ఉందో లేదో తెలుసుకోవచ్చు. హార్ట్ ఫెయిల్యూర్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనికి జీవితకాలం చికిత్స అవసరం. చికిత్సలో మందులు మాత్రమే కాకుండా ఆహారం మరియు జీవనశైలిలో కూడా మార్పులు చెయ్యాలి.
Pingback: Symptoms of hyperthyroidism in Telugu - DM HEART CARE CLINIC