శరీరంలో అవయవాలన్నింటికీ సరిపడేంత రక్తం సరఫరా చెయ్యలేకపోతే, దాన్ని హార్ట్‌ఫెయిల్యూర్ (heart failure) అంటారు. దీన్నే గుండె కండరాల వైఫల్యం అని కూడా అంటారు. శ్వాస ఆడకపోవడం మరియు కాళ్ళు వాపు గుండె వైఫల్యానికి రెండు సాధారణ లక్షణాలు. చికిత్సలో మందులు మాత్రమే కాకుండా, ఆహారం మరియు జీవనశైలిలో కూడా మార్పులు చెయ్యాలి. అవి ఏమిటో చూద్దాం. గుండె వైఫల్యానికి అనేక కారణాలు ఉన్నాయి కానీ జీవనశైలి మార్పులు కారణంతో సంబంధం లేకుండా ఒకే విధంగా ఉంటాయి.
1. తక్కువ ఉప్పు తీసుకోవడం తప్పనిసరి (low salt diet)
ఆహారంలో అధిక ఉప్పు తీసుకోవడంవల్ల, హార్ట్ ఫెయిల్యూర్ రోగుల శరీరంలో అదనపు నీరు పేరుకుపోవడం జరుగుతుంది . ఆహారంలో అధిక ఉప్పు తీసుకోవడం, శరీరం నుండి నీటిని సమర్థవంతంగా తొలగించడాన్ని నిరోధిస్తుంది. ఇలా చెయ్యడం, హార్ట్ మందుల సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తుంది. అధిక ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా పెరుగుతుంది. రక్తపోటు పెరుగుదల వల్ల గుండె కష్టపడి పనిచేయ్యాల్సివస్తుంది మరియు హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధి వేగంగా అభివృద్ధి చెందుతుంది. హార్ట్ ఫెయిల్యూర్ రోగులలో, తరచుగా ఆసుపత్రి అడ్మిషన్ అవ్వడానికి, అధిక ఉప్పును తీసుకోవడం ఒక ప్రధాన కారణం అని తెల్సింది. ఆహారంలో తక్కువ ఉప్పు తీసుకోవడం, శరీరంలో నీరు అధికంగా చేరడం నిరోధిస్తుంది, ఆసుపత్రి అడ్మిషన్ అవ్వడాన్నితగ్గిస్తుంది మరియు వ్యాధి యొక్క పురోగతిని ఆలస్యం చేస్తుంది.
2. ఆల్కహాల్ (alcohol) తీసుకోవడం మానెయ్యండి
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, కాలేయం మాత్రమే కాదు, గుండె కూడా దెబ్బతింటుంది. దీర్ఘకాలం పాటు మద్యం సేవించడం వల్ల, కొంతమందిలో గుండె బలహీనపడవచ్చు. దీన్ని ఆల్కహాల్ కార్డియోమయోపతి అంటారు. అలాంటి వ్యక్తులు, వెంటనే మద్యం తీసుకోవడం మానేయాలి. ఆల్కహాల్ కాకుండా ఇతర కారణాల వల్ల గుండె బలహీనమైన ఇతర రోగులకు, ఆల్కహాల్ ఆపడం మంచిది. అతిగా మద్యం తీసుకోవడం, అరిథ్మియా ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
3. ధూమపానం (smoking) మానేయడం తప్పనిసరి
సిగరెట్, ధూమపానం గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది మరియు మీ ఊపిరితిత్తులను కూడా దెబ్బతీస్తుంది. సిగరెట్, గుండెకు సరఫరా చేసే నాళాలను కొలెస్ట్రాల్‌తో మూసుకుపోయేటట్టు చేస్తుంది. ధూమపానం గుండెపోటు రావడానికి కూడా దారితీస్తుంది. గుండెపోటు, బలహీనమైన గుండెను మరింత బలహీనపరుస్తుంది.
4. శరీర బరువును అదుపులో ఉంచడం తప్పనిసరి
ఊబకాయం మరియు అధిక బరువు ఉన్న రోగులలో, ఆరోగ్యకరమైన గుండెకూడా, శరీరానికి మద్దతుఇవ్వడానికి చాలా కష్టపడాల్సిఉంటుంది. సాధారణ గుండె అలా కష్టపడగలదుకానీ, బలహీనమైన గుండె అలా కష్టపడలేదు. బలహీనమైన గుండెను అలా కష్టపెట్టడం వలన, అది మరింత బలహీనంగా మారుతుంది. బరువును అదుపులో ఉంచడంవల్ల, బలహీనమైన గుండె తనపనిని సులభంగా చేయగలుగుతుంది.
5 . శరీర బరువును తరచుగా కొలవడం
శరీర బరువును తరచుగా కొలవడం ద్వారా శరీరంలో నీరు చేరడం తొందరగ గుర్తించవచ్చు. శరీర బరువు పెరగడం, గుండె పరిస్థితి క్షీణించటానికి సంకేతం మరియు సమీప భవిష్యత్తులో ఆసుపత్రి అడ్మిషన్ అవ్వడానికి కి హెచ్చరిక. తరచుగా బరువును కొలవడం ద్వారా, నీరు చేరడం ముందుగా గుర్తించి, మందుల మోతాదును మార్చవచ్చు. ఒక రోజులో బరువు 1 కిలోగ్రాము పెరిగితే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఒక వారంలో బరువు 2 కిలోగ్రాము పెరిగితే కూడా, అత్యవసరంగా గుండె వైద్యుడిని సంప్రదించండి.
6. తక్కువ నీటిని తీసుకోవడం
తేలికపాటి గుండె వైఫల్యం ఉన్న రోగులు, తగినంత నీరు త్రాగవచ్చు. కానీ తీవ్రమైన గుండె వైఫల్యం ఉన్న రోగులు, నీరు ఎక్కువగా తీసుకోకండి. తీవ్రమైన గుండె వైఫల్యం ఉన్న రోగులు, త్రాగె అదనపు నీటిని వారి శరీరం మరియు ఊపిరితిత్తులలో నిలుపుకుంటారు.
తీవ్రమైన గుండె వైఫల్యం ఉన్న రోగులు, తరచుగా ఊపిరి ఆడకపోవడం మరియు కాలు వాపు సమస్యలతో బాధపడతారు. ఈ రోగులు ఎక్కువ నీటి వినియోగంవల్ల ఊపిరి ఆడకపోవడం మరియు కాళ్ళవాపు సమస్యలు మరింత పెరుగుతాయి. ఈ రోగులు, రోజుకు 2 లీటర్ల కంటే తక్కువ నీరు తాగడం మంచిది.
7. న్యుమోకాకల్ టీకా, ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకోవాలి (pneumococcal vaccine and influenza vaccine)
గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి, ఫ్లూ త్వరగా సోకుతుందని నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి, ప్రతి సంవత్సరం ఇన్‌ఫ్లుఎంజా వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా వేయించుకోవాలి.
న్యుమోకాకల్ న్యుమోనియా అనేది తీవ్రమైన సమస్య. గుండె సమస్యలతో బాధపడుతున్న వారికి, న్యుమోనియా తీవ్రమైన స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బులు ఉన్నవారు, న్యుమోనియా నుండి రక్షించుకోవడానికి న్యుమోకాకల్ టీకాలు వేయించుకోవాలి.
8. రెగ్యులర్ వ్యాయామం చేయడం
మీ శరీరం అనుమతించినట్లయితే, వారానికి కనీసం 5 రోజులు, రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామం, రక్తపోటు, రక్తంలో చక్కెర మరియు శరీర బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. వ్యాయామం, శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గుండె రోగులు వ్యాయామం చేసేటప్పుడు, భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలి మరియు వారి పరిమితికి మించి చేయకూడదు. నడక మరియు సరళమైన స్ట్రెచెస్, హార్ట్ ఫెయిల్యూర్ రోగులకు సురక్షితమైన మరియు ఉత్తమమైన వ్యాయామాలు.
9. ఒత్తిడిని తగ్గించుకోండి
మీకు ఒత్తిడి కలిగించే విషయాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురికాకుండా చూసుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, యోగా, ధ్యానం, ఆధ్యాత్మికత వంటి ప్రక్రియలు బాగా ఉపయోగపడతాయి.
10. డాక్టర్ సలహా లేకుండా ఇతర మందులు తీసుకోరాదు
హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న రోగులలో, సాధారణ క్లినికల్ ఉపయోగంలో ఉన్న అనేక మందులు తీసుకోరాదు. ఎందుకంటే, అవి హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధి వేగంగా అభివృద్ధి చెందడానికి కారణం కావచ్చు. వాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలో నీరు అధికంగా చేరడానికి దారితీయవచ్చు. అందువలన, మీ వైద్యుడిని అడగకుండా, ఎటువంటి మాత్రలు తీసుకోకండి. మీ వైద్యుల సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్, యాంటీబయాటిక్స్ తీసుకోవద్దు.
11. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి
గుండె వైఫల్యం ఒక దీర్ఘకాలిక వ్యాధి. మీ డాక్టర్‌తో జీవిత కాలం ఫాలో అప్ అవసరం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ ఉండటం వల్ల, గుండెకు వాటిల్లే నష్టం నివారించడానికి వీలవుతుంది. మందులు ఎప్పటికీ తీసుకోవాలి కాబట్టి, మీ డాక్టర్ మీ పరిస్థితికి అనుగుణంగా వాటి మోతాదులను నిర్ణయిస్తారు. కాబట్టి మీ వైద్యుడిని సందర్శించడం ఆపవద్దు. Nt Pro-BNP, ఇసిజి, 2d ఎకో, రక్త పరీక్షలు కొన్ని ఉదాహరణలు
12. మీ రక్తపోటును (blood pressure) కంట్రోల్లో పెట్టుకోవాలి
గుండె వైఫల్యం ముదరకుండా ఉండడానికి, రక్తపోటును కంట్రోల్లో పెట్టుకోవాలి. దీనికోసం మీరు బీపీ టాబ్లెట్ తీసుకోవాలి. బీపీ ఎల్లప్పుడూ 120 / 80 కంటే తక్కువగా ఉండాలి.
13. మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోండి
మీ చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకుంటే, గుండె సమస్య మరింత తీవ్రతరం అవవచ్చు. దాని కోసం , మంచి డయాబెటాలజిస్ట్‌ని సంప్రదించండి.
14. సూచించిన మాత్రలు ప్రతిరోజూ తప్పనిసరిగా తీసుకోండి
మందులను ఆపడం, తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. మీరు ఆపితే, ఆసుపత్రిలో చేరడం కూడా అవసరం కావచ్చు. కాబట్టి, అంతరాయం లేకుండా, మాత్రలు తీసుకోండి.
15. మీ ఆహారంలో ఈ క్రింది మార్పులు చేయండి
తాజా పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్ , కొవ్వు తీసిన లోఫేట్ పాలు , మరియు ఆకుకూరలతో కూడిన పోషకాహారం తీసుకోవాలి. సాల్ట్, షుగర్, మరియు రిఫైండ్ గ్రెయిన్స్ ని, వీలున్నంత తక్కువగా తీసుకోవాలి.
చేపలు తీసుకోండి. గుడ్డులోని తెల్లసొన తీసుకోవచ్చు. చికెన్ మరియు మటన్ కొద్దిగానే తీసుకోండి.
పప్పులు, గింజలు తినవచ్చు,
వేపుడు వస్తువులు (fry items) తినవద్దు.
ఊరగాయలకు (pickles) దూరంగా ఉండండి.
కొవ్వు పదార్ధాలను నివారించండి.
ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లకు దూరంగా ఉండండి.
ప్రొసెస్డ్ ఫుడ్ (processed food), రెడీ మేడ్ ఫుడ్లను నివారించండి.