ట్రైగ్లిజరైడ్ స్థాయిలు డెసిలీటర్కు 150 మిల్లి గ్రాములు వరకు ఉంటే నార్మల్. 150 నుంచి 199 మధ్య ఉంటే బార్డర్ లెవల్ హై అని చెబుతారు. 200 పైన ఉంటే అధికంగా ఉన్నాయని అర్థం. 500, ఆ పై ఉంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం.
హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరగడానికి గల టాప్ టెన్ కారణాల (Top 10 causes of high triglycerides) గురించి మాట్లాడుకుందాము.
1.కిడ్నీ వ్యాధి (2%)
రక్తప్రవాహం నుండి ట్రైగ్లిజరైడ్‌లను తొలగించడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వ్యక్తులలో, ఈ క్లియరెన్స్ ప్రక్రియ తక్కువగా ఉంటుంది. కాబట్టి మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే, సీరం ట్రైగ్లిజరైడ్ స్థాయిలు పెరగవచ్చు.
2.కాలేయ వ్యాధి (4%)
ట్రైగ్లిజరైడ్‌ల ప్రొడక్షన్ , స్టోరేజ్ మరియు విడుదల లాంటి లిపిడ్ జీవక్రియలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వివిధ కాలేయ వ్యాధులు ఈ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తాయి.అందుకే ఫ్యాటీ లివర్ డీసీజ్ వంటి కాలేయ సమస్య ఉన్నట్లయితే ట్రైగ్లిజరైడ్ రక్తంలో పేరుకుపోతుంది .
3.మందులు (6%)
స్టెరాయిడ్స్,మూత్రవిసర్జనకారక మందులు, జనన నియంత్రణ మాత్రలు, రోగనిరోధక వ్యవస్థను అణిచివేసే మందులు, బీటా బ్లాకర్స్ మరియు కొన్ని యాంటిసైకోటిక్ డ్రగ్స్ వంటి కొన్ని మందులు ట్రైగ్లిజరైడ్స్‌ను పెంచుతాయి.
4.ఆల్కహాల్ వినియోగం (8%)
ఆల్కహాల్‌లో కేలరీలు మరియు చక్కెర అధికంగా ఉంటాయి.
అధిక ఆల్కహాల్ తీసుకోవడం, ముఖ్యంగా అతిగా మద్యపానం చేయడం, ట్రైగ్లిజరైడ్‌లను పెంచుతుంది. రెగ్యులర్ గా మరియు అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. దీనికి తోడు కొంతమంది ఆల్కహాల్తో పాటు కోలా డ్రింకులు కలుపుకోవడం చేస్తుంటారు. ఈ రెండింటి దుష్ఫలితాలు కలిసి రెట్టింపుగా పరిణమిస్తాయి. ఆల్కహాల్ తాగిన సమయంలో వేపుడు పదార్థాలు కూడా ఎక్కువగా తీసుకుంటుంటారు.
5.జన్యుపరమైన కారణాలు (10%)
కొన్ని జన్యు వైవిధ్యాలు మన శరీరం కొవ్వులను ఎలా ప్రాసెస్ చేస్తుంది అనేదానిని ప్రభావితం చేస్తుంది.కొంతమంది వ్యక్తులు రక్తంలో ట్రైగ్లిజరైడ్ నిల్వ చేసుకొనే తత్త్వం జన్యు పరంగా కలిగి ఉండవచ్చు. అంటే ఈ జన్యుపరమైన కారకాలను వారసత్వంగా పొందుతారు అని అర్ధం
6.థైరాయిడ్ డిజార్డర్స్ (10%)
థైరాయిడ్ హార్మోన్ లిపిడ్ జీవక్రియను ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయలేనప్పుడు హైపోథైరాయిడిజం సమస్య ఏర్పడుతుంది.హైపోథైరాయిడిజం కల క్రమేణా అధిక ట్రైగ్లిజరైడ్‌లకు దారితీస్తుంది అని నిపుణులు చెబుతున్నారు
7.శారీరక శ్రమ లేకపోవడం(10%)
ఎక్కువగా శరీరం కదలకుండా జీవనం సాగించే వారికి అధిక ట్రైగ్లిజరైడ్స్ ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి . గంటల కొద్దీ కూర్చున్న చోటు నుంచి లేవ కుండా పనిచేయడం , క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం ఆరోగ్యానికి మంచిది కాదు
8.మధుమేహం(15%)
డయాబెటిస్ ఉన్నవారిలో ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో దాదాపు 30-40% మంది అధిక ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కలిగి ఉంటారు .మరీ ముఖ్యంగా డయాబెటిస్ నియంత్రణలో లేకపొతే రక్తంలో ట్రైగ్లిజరైడ్ నిల్వలు అమాంతంగా పెరిగిపోతాయి.
డయాబెటిస్ లో ఇన్సులిన్ నిరోధకత వల్ల శరీరంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసే విధానం మారిపోతుంది.
9.ఊబకాయం (20%)
ఊబకాయం లేదా బరువు ఎక్కువ ఉండే వారికి అధిక ట్రైగ్లిజరైడ్స్ ఉండే అవకాశం ఉంది. బరువు మరీ ఎక్కువ లేకపోయినా విసెరల్ కొవ్వు అంటే నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం కూడా ఒక కారణమే. ఊబకాయం లో ఇన్సులిన్ నిరోధకత పెరగుతుంది. దీని వల్ల శరీరంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసే విధానం మారిపోతుంది. దీని ఫలితంగా రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి.
10.అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు (25%)
మనం తీసుకునే ఆహారంలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. ముఖ్యంగా మితిమీరి తీపిపదార్థాలు తినడం , శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తీసుకోవడం అన్న మాట. కోలా డ్రింకులు, శీతల పానియాలను ఎక్కువగా తీసుకోవడం , మార్కెట్‌లో తేలికగా దొరకే జంక్‌ఫుడ్, బేకరీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి . ఈ చక్కెరలు కాలేయంలో ట్రైగ్లిజరైడ్స్‌గా మార్చబడతాయి మరియు కొవ్వు కణాలలో నిల్వ చేయబడతాయి.
వైట్ బ్రెడ్, వైట్ రైస్ మరియు మైదా వంటివి కూడా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు.
వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్ మరియు కొన్ని ప్రాసెస్ చేసిన స్నాక్స్‌లో ఉండే సంతృప్త కొవ్వులు మరియు ట్రాన్స్ ఫ్యాట్‌లు ట్రైగ్లిజరైడ్‌లను పెంచుతాయి.
అరుగుదల శక్తిని మించి అధిక కేలరీల ఆహారాల్ని ప్రతి నిత్యం తినడం వల్ల ఈ అదనపు కేలరీలు కొవ్వు కణాలలో నిల్వ చేయడానికి ట్రైగ్లిజరైడ్‌లుగా మార్చబడతాయి.