గుండెపోటు చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఎందుకంటే, గుండెపోటుతో బాధపడుతున్న చాలా మంది వ్యక్తులు, గుండెపోటు వచ్చిన మొదటి కొన్ని గంటల్లోనే మరణిస్తారు. అయినప్పటికీ, మీరు గుండెపోటు వచ్చిన మొదటి గంటలో ప్రథమ చికిత్స తీసుకుంటే, గుండెపోటు వల్ల వచ్చే ప్రమాదాన్ని సగానికి తగ్గించవచ్చు.
గుండెపోటు సమయంలో ఛాతీ నొప్పి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ ఉంటుంది. కొంతమందికి తేలికపాటి ఛాతీ నొప్పి ఉంటుంది, మరికొందరికి మరింత తీవ్రమైన నొప్పి ఉంటుంది. చాతి నొప్పితో పాటు చెమట పట్టడం, కళ్లు తిరగడం, చేయి లాగడం, దవడ లాగడం, వాంతులు రావడం లాంటివి జరగవచ్చు. చాతిలో వచ్చిన నొప్పిని గ్యాస్టిక్ సమస్యగా భావించి ప్రమాదానికి గురైన వాళ్లు చాలామంది ఉన్నారు. గ్యాస్టిక్ సమస్య, గుండె పోటు లక్షణాలు మధ్య తేడాలు గుర్తించడం కొన్నిసార్లు డాక్టర్ల వల్ల కూడా కాదు. అనుమానం ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లడం తప్పేం కాదు.
చాలా మంది గుండెపోటు రోగులు ఆసుపత్రికి చేరుకోకముందే మరణిస్తున్నారు. కాబట్టి గుండెపోటు యొక్క లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే మీ స్థానిక అంబులెన్స్ నంబర్‌కు కాల్ చేయండి. మీ వద్దకు రావడానికి అంబులెన్స్ అందుబాటులో లేకుంటే, మీ పొరుగువారిని లేదా స్నేహితుడిని మిమ్మల్ని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లమని అడగండి. మీకు వేరే మార్గం లేకుంటే మాత్రమే మీరు డ్రైవ్ చేయండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ ఆరోగ్యపరిస్థితి క్షీణించవచ్చు. కాబట్టి స్వంత డ్రైవింగ్ మిమ్మల్ని మరియు ఇతరులను ప్రమాదంలో పడేస్తుంది.
అంబులెన్స్ వచ్చేలోపు లేదా హాస్పిటల్ కి వెళ్లే లోపు మనం చేయాల్సిన మరియు చేయకూడని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం.
గుండెపోటు ఉన్న వ్యక్తిని ఒంటరిగా వదలకండి.
లక్షణాలు తొలగిపోతాయో లేదో అని వేచి చూడకండి. ఆ లక్షణాలు ఎసిడిటీ వల్ల వస్తున్నాయని ఎల్లప్పుడు అనుకోకండి.
అంబులెన్స్ వచ్చేలోపు ఎక్కువగా కూర్చోండి లేదా పడుకోండి.
రోగిని ఎలాంటి వ్యాయామం చేయడానికి అనుమతించవద్దు. రోగితో మెట్లు ఎక్కించడం, నడిపించడం కూడా చేయించరాదు.
రోగి దుస్తులు బిగుతుగా ఉంటే వాటిని లూజ్ చేయండి.
గుండెపోటు వచ్చిన వ్యక్తి బాగా భయపడటం సహజం. కానీ భయపడడం వల్ల హార్ట్ బీట్ ఎక్కువయ్యి మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ధైర్యంగా ఉండమని చెప్పాలి. రోగితో పాటు ఉన్నవాళ్లు కూడా, ధైర్యంగా ఉండాలి .
గోల్డెన్ అవర్
గుండెపోటు లక్షణాలు బయటపడ్డ మొదట గంటని గోల్డెన్ అవర్ ఉంటారు. అంటే ఈలోపు రోగిని హాస్పిటల్కి తీసుకువెళ్లగలిగితే అతన్ని మనం తప్పక కాపాడవచ్చు అని అర్థం. అందువల్ల మనం గుండెపోటును తక్షణమే పసిగట్టి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి.
ఆస్పిరిన్
వీలైనంత త్వరగా ఆస్పిరిన్‌ని చప్పరించండి. ఆస్పిరిన్ మీ రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుంది. గుండెపోటు సమయంలో తీసుకుంటే, గుండెకు జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మీరు ఆస్పిరిన్‌కు అలెర్జీని కలిగి ఉంటే లేదా ఆస్పిరిన్ తీసుకోవద్దని మీ డాక్టర్ చెప్పినట్లయితే తీసుకోకండి. మీకు సందేహం ఉంటే, ఆస్పిరిన్ టాబ్లెట్ తినవచ్చా అని అంబులెన్స్ వ్యక్తిని అడగండి.
యాస్పిరిన్ భారతదేశంలో ఎకోస్ప్రిన్ లేదా డిస్ప్రిన్ పేరుతో లభిస్తుంది. ఆస్పిరిన్ మూడు వందల ఇరవై ఐదు మిల్లీగ్రాము మోతాదులో లభిస్తుంది. ఒక అధ్యయనంలో, గుండెపోటు సమయంలో ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకోవడం ద్వారా, గుండెపోటు కారణంగా మరణ ప్రమాదాన్ని ఇరవై మూడు శాతం తగ్గించింది.
మీ ఇసిజిని చెయ్యమని అంబులెన్స్ వ్యక్తిని అడగండి.
నైట్రోగ్లిజరిన్
మీ డాక్టర్ సూచించినట్లయితే నైట్రోగ్లిజరిన్ టాబ్లెట్ తీసుకోండి. ఇది భారతదేశంలో సార్బిట్రేట్ పేరుతో లభిస్తుంది. ఇది ఐదు మరియు పది మిల్లీగ్రాము మోతాదులలో లభిస్తుంది. నొప్పి నుండి ఉపశమనం పొందడానికి ఒక టాబ్లెట్ నమలండి.
క్లోపిడోగ్రెల్, రోసువాస్టాటిన్
వీటితో పాటు క్లోపిడోగ్రెల్ ఆరు వందల మిల్లీగ్రాము మోతాదులో మరియు రోసువాస్టాటిన్ నలభై మిల్లీగ్రాము మోతాదులో తీసుకుంటే ఇంకా మంచిది.
గుండెపోటు సమయంలో ఈ మాత్రలు వాడాలి అని చాలా మందికి తెలియదు.
ఈ మాత్రలు తీసుకోవడం వల్ల గుండెపోటు మరణాలు ఇరవై ఐదు శాతం తగ్గుతాయి. ఈ రెండు మాత్రలు గుండెకు రక్త ప్రసరణ బాగా జరగడానికి ఎంతో ఉపయోగపడతాయి.అయినప్పటికీ ఇది ప్రథమ చికిత్స మాత్రమే. కేవలం టాబ్లెట్ తీసుకోవడం ద్వారా, మీరు ఆసుపత్రికి వెళ్లకూడదని అర్థం కాదు. గుండెపోటుకు అసలైన వైద్యం స్టంటు మాత్రమే. ఎంత త్వరగా స్టంటు వేయించుకుంటే అంత మంచిది.
కాబట్టి ఈ మాత్రలను ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడం మంచిది. ఒక వ్యక్తి ఎంత త్వరగా ఆసుపత్రికి వెళ్తే, బతికే అవకాశం అంత మెరుగ్గా ఉంటుంది.
హార్ట్ ఎటాక్ సమయంలో సెకండ్ ఒపీనియన్ గురించి అస్సలు ఆలోచించవద్దు. వీటి వల్ల ఎంతో విలువైన సమయం కోల్పోవలసి వస్తుంది.
డాక్టర్ ఇసిజి చూసి హార్ట్ఎటాక్ అని చెబితే అతన్ని ఇతర టెస్ట్లు చేయకుండా ఎలా చెప్పగలరు అని ప్రశ్నించవద్దు. వేరే పరీక్షలు ( ట్రోపోనిన్,
2d ఎకో పరీక్ష, tmt పరీక్ష)కోసమని సమయం వృధా చేసుకోవద్దు. ఇసిజి ద్వారా గుండెపోటును ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు.
ఈ సమయంలో మనం సమయాన్ని ఎంత ప్రయోజనకరంగా మార్చుకుంటామో దానిపైన రోగి యొక్క జీవితం ఆధారపడి ఉంది.
ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే సారాంశం ఏమిటంటే గుండెపోటు సమయంలో విలువైన సమయాన్ని వృధా చేయకండి. ఎందుకంటే టైం ఈజ్ లైఫ్.